: పార్కింగ్ కోసం కొడుకుని 20 నిమిషాలు ఎండలో కూర్చోబెట్టిన తల్లి...నెటిజన్ల మండిపాటు


మెట్రోనగరాల్లో పార్కింగ్ కష్టాలు చెప్పనలవి కాదు. పార్కింగ్ స్థలం కోసం 20 నిమిషాల పాటు కుమారుడ్ని ఎండలో కూర్చోబెట్టిన ఓ తల్లిని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగతిడుతున్న ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కౌలాలంపూర్‌ లోని జలన్‌ కుచాయ్‌ లామా రోడ్‌ నిత్యం బిజీగా ఉంటుంది. అక్కడ బిజీ అవర్స్‌ లో పార్కింగ్‌ దొరకడం అద్భుతమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి చోట తన కారుని పార్క్ చేయడానికి, ఓ మహిళకు ఒకచోట ఖాళీ కనిపించింది. అంతే, అక్కడ కారు పెట్టుకుంటే చాలా సేపు షాపింగ్ చేసుకోవచ్చని భావించిన ఆ మహిళ, తన కొడుకుని అక్కడ కూర్చోమని చెప్పి, అక్కడ ఎవరైనా కారు పెట్టేందుకువస్తే, తన తల్లి కారుతో వస్తోందని చెప్పమని చెప్పి, దూరంగా ఎక్కడో వదిలిన తన కారును తీసుకొచ్చేందుకు ఆమె వెనక్కి వెళ్లింది. తీరా ఆమె తన కారుని అక్కడికి తేవడానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టింది. ఇంత సేపు ఎండలో ఆ బాబు అలాగే ఒంటరిగా కూర్చున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న వారు బాబు తప్పిపోయాడని భావించి, ఏమైంది? అలా ఒంటరిగా కూర్చున్నావు? అని అడిగారు. దీంతో తన తల్లి పార్కింగ్‌ స్థలం కోసం కూర్చోమని చెప్పిందని, అందుకే ఇక్కడ కూర్చున్నానని సమాధానం చెప్పాడు. దీంతో వారంతా షాక్ తిన్నారు. దీంతో ఓ వ్యక్తి ఆ బాబు ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి, జరిగిందంతా వివరిస్తూ పోస్టు చేయగా, దానిని చదివిన వారంతా బాబు తల్లిని తిట్టిపోస్తున్నారు.

  • Loading...

More Telugu News