: న్యూజిలాండ్ ను తిప్పేసిన స్పిన్ ద్వయం; 262 పరుగులకే ఆలౌట్
భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, జడేజాల దెబ్బకు న్యూజిలాండ్ ఆటగాళ్లు బేర్ మన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ 318 పరుగులకు బదులుగా, ఒక వికెట్ నష్టానికి 152 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ సరిగ్గా 100 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టు 95.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ కు 56 పరుగుల లీడ్ లభించింది. నేటి ఆటలో రోంచీ (38), శాంట్ నర్ (32)లు మినహా మరెవరూ పెద్దగా రాణించలేదు. సోధీ, బౌల్ట్, టేలర్ లు డక్కౌట్ కాగా, క్రెయిగ్ 2, వాట్లింగ్ 21 పరుగులు చేశారు. జడేజాకు 5, అశ్విన్ కు 4 వికెట్లు లభించగా, ఉమేష్ యాదవ్ కు ఒక వికెట్ లభించింది. మరికాసేపట్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుండగా, వరుణుడు అడ్డుకోకుంటే, ఈ మ్యాచ్ లో ఫలితం ఖాయంగా వస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.