: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను అడ్డుకున్న ఎంఐఎం... రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించిన వేళ ఎంఐఎం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సులేమాన్ బస్తీలో ప్రకాష్ పర్యటిస్తుండగా, అక్కడి కార్పొరేటర్లు, తమ అనుచరులతో వచ్చి అభివృద్ధి పనులు జరిపించని ఎమ్మెల్యే, ఎందుకు పర్యటనలు చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని ఒకరు దుర్భాషలాడుకుంటూ చెయ్యి చేసుకునేంత వరకూ వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణం స్పందించి ఘటనా స్థలికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.