: చికిత్స కోసం ముఖ్యమంత్రి జయలలితను సింగపూర్‌కు తరలించే యోచనలో వైద్యులు
అస్వస్థతకు గురయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రెండు రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమెను అక్కడి నుంచి సింగపూర్ తరలించాలని యోచిస్తున్నారు. జయలలితకు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మరింత మెరుగైన చికిత్సను అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, జ్వరం తగ్గిందని చెప్పారు. ముఖ్యమంత్రికి సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ తమిళనాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు వారు చేరుకుంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ప్రధాని మోదీ ఆమెకు బొకే పంపించారు. అందుకు జయలలిత స్పందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖ రాశారు. జయలలిత అస్వస్థతకు గురికావడం ఆందోళనకరంగా ఉందని, ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు.