: విమానంలో పేలిన ఫోన్.. సామ్‌సంగ్ నోట్ ఫోన్లను విమానాల్లోకి అనుమతించవద్దని సూచించిన అధికారులు
సెల్‌ఫోన్ పేలి, స్వల్పంగా మంటలు వ్యాపించిన ఘటన ఈరోజు ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. సింగపూర్ నుంచి వచ్చిన విమానం చెన్నైలోని ఓ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ప్రయాణికుడు తన సామ్‌సంగ్ నోట్ 2 ఫోన్ ఓవర్‌హెడ్ బిన్‌పై ఉంచాడు. అయితే ఒక్కసారిగా ఫోన్ పేలిందని, ఈ ఘటనపై సామ్‌సంగ్ సంస్థ వివరణ ఇవ్వాలంటూ ఆ సంస్థకు సమన్లు జారీ చేశామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. ప్రయాణికుడు తన ఫోన్‌ను ఓవర్‌హెడ్ బిన్‌పై ఉంచినప్పుడు స్విచ్చాఫ్ చేశాడో లేదో తమకు తెలియదని అధికారులు పేర్కొన్నారు. ఫోను పేలి, మంటలు వచ్చిన కారణంగా విమానంలో ఉన్న వారెవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. ఇకపై సామ్‌సంగ్ నోట్ ఫోన్లను విమానాల్లోకి ప్రయాణికులు తీసుకురావడాన్ని అనుమతించవద్దని అధికారులు అన్ని విమానయాన సంస్థలకు సూచించారు.