: ఒక్కసారి విశాఖ వస్తే మళ్లీ మళ్లీ రావాలని అనిపిస్తుంది: చంద్రబాబు
విశాఖపట్టణం అందమైన, అద్భుతమైన నగరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖటపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు విశాలమైన సముద్రం, ఎత్తైన కొండలు, విశాలమైన భూభాగం కలిగిన విశాఖపట్టణం, మూడు విభిన్న పరిస్థితులతో చూడడానికి చాలా సుందరంగా ఉంటుందని కితాబునిచ్చారు. అందుకే విశాఖపట్టణంలో ఒకసారి కాలు పెడితే మళ్లీమళ్లీ వస్తూనే ఉంటారని ఆయన అన్నారు. భారత్ లోని సుందరనగరాల్లో విశాఖపట్టణం ఒకటని, అలాంటి నగరంలో మెగా ఆక్వా ఎక్స్ పో నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. విశాలమైన సముద్ర తీరం భారతదేశానికి ప్లస్ పాయింటని ఆయన అన్నారు. ఏపీకి సువిశాల సముద్ర తీరం ఉండడంతో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఎక్స్ పో ద్వారా ఇక్కడ ఆక్వారంగానికి ఉన్న అవకాశాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. 924 కిలోమీటర్ల సముద్రతీరం ఉండడం ఆంధ్రప్రదేశ్ బలమని ఆయన చెప్పారు. అందుకే ఆక్వారంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఆక్వారంగం అంటే ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించేలా చేయాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.