: బట్టబయలైన భద్రతలోని డొల్లతనం... ఎయిర్ పోర్టు గోడదూకి, రన్ వేపై తిరిగిన వ్యక్తి!


ఓ వ్యక్తి న్యూఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గోడదూకి రన్ వే పైకి వెళ్లి, అరగంటపాటు అక్కడే తిరిగిన ఘటన పెను కలకలం రేపుతోంది. చుట్టూ పెద్ద ఎత్తున ప్రహరీ గోడ, దానికి పైన ఇనుపముళ్ల కంచె, నిత్యం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షణ, ప్రతిక్షణం పహారా కాసే వాచ్ టవర్స్.. ఇన్ని వున్నా కూడా ఒక వ్యక్తిని అడ్డుకోలేకపోయాయి. గోడ ఎక్కి, సిబ్బంది కళ్లుగప్పి రన్ వే పైకి వెళ్లి అరగంట పాటు తిరిగిన ఆ వ్యక్తి ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ భద్రతలో డొల్లతనాన్ని బయటపెట్టాడు. రన్ వేపైకి వెళ్లిన అతని చేతిలో ఓ బ్యాగ్, ఇతర వస్తువులు కూడా ఉండడం విశేషం. సుమారు అరగంటపాటు రన్ వే పై అటూఇటూ తిరిగిన తరువాత 19, 20 వాచ్ టవర్ సిబ్బంది అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిని మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన సంగ్రామ్ సింగ్ గా అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్లాడంటే, ట్రైన్ కోసం వెళ్లాడట. మధ్యప్రదేశ్ లోని తమ ప్రాంతానికి వెళ్లే రైలుకి సమయం సమీపిస్తుండడంతో అడ్డుగా ఉన్న గోడను దూకానని, ట్రైన్ పట్టుకునే ప్రయత్నంలో ఉన్నానని తెలిపాడు. దీంతో అతను నిజంగా రైలు కోసమే వెళ్లాడా? లేక రెక్కీ నిర్వహించాడా? అన్న విషయాలు కూపీ లాగే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి అసలు గోడ ఎలా ఎక్కాడు? రన్ వే వద్దకు వెళ్లే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేశారని ఉన్నతస్థాయి అధికారులు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News