: సినీ ఫక్కీలో ఊహించని విధంగా కారును ఎత్తుకెళ్లిపోయాడు
హైదరాబాదులో సినీ ఫక్కీలో ఓ దొంగ కారు ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ లో విధులు నిర్వర్తించే శ్రీమన్నారాయణ తన స్నేహితులతో కలిసి అమీర్ పేట్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో డిన్నర్ కి వెళ్లారు. ఆయన కారు దిగి వాలెట్ పార్కింగ్ కోసం హోటల్ డ్రైవర్ కి తాళాలు ఇచ్చారు. అంతలోనే వీరికి సంబంధం లేని ఓ వ్యక్తి వెనుక వైపు డోర్ తీసుకుని కారులోకి దూరి దర్జాగా కూర్చున్నాడు. శ్రీమన్నారాయణ నుంచి తాళాలు తీసుకున్న వాలెట్ పార్కింగ్ డ్రైవర్ కారును పార్క్ చేసేందుకు కారులోకి రాగానే వెనుకసీట్లో దర్జాగా కూర్చున్న అతనిని చూసి, వారితో కలిసి వచ్చాడని భావించి ‘సార్! లోపలికి వెళ్లండి’ అన్నాడు. దానికి ఆ వ్యక్తి ‘నాకు అన్ ఈజీగా ఉంది, కారులోనే కూర్చుంటాను... ఏసీ ఆన్ లో ఉంచు’ అన్నాడు. దాంతో వాలెట్ పార్కింగ్ డ్రైవర్ కారును పార్క్ చేసి, ఏసీని ఆన్ లో ఉంచి, తాళాలు అతని చేతికి ఇచ్చాడు. దీంతో కాసేపటి తరువాత దొంగ కారుతో ఊడాయించాడు. డిన్నర్ ముగించుకొని వచ్చిన శ్రీమన్నారాయణ తన కారు ఏదని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కారు పోయిందని ఆయన ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించి, అతని ఫోటోను విడుదల చేశారు. నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.