: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం...అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చిందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 48 గంటలపాటు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ తరువాతి మూడు రోజుల పాటు దీని ప్రభావంతో చెదురుమదురు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటు, అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో తక్కువ సమయంలో అతి భారీ వర్షం (హెవీ స్పెల్స్) కురిసే అవకాశముందని వారు వెల్లడించారు. కేవలం రెండు మూడు గంటల వ్యవధిలో ఏకంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రోజంతా 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే వస్తే నష్టం ఉండదని తెలిపిన వాతావరణ శాఖ, ఇదే వర్షపాతం కేవలం 2, 3 గంటల్లో నమోదైతే హైదరాబాదు అతలాకుతలం కావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని వారు సలహా ఇస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ నెల (సెప్టెంబర్) ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 22 రోజుల్లో సాధారణం కంటే 120 శాతం అధిక వర్షపాతం నమోదైందని వారు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా గత 22 రోజుల్లో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 217.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇదే వర్షపాతం హైదరాబాదులో 361 శాతం అధికంగా నమోదైందని వారు వెల్లడించారు.