: ‘నాటి మాటలవి.. నేటి మాటలివి’ నాడు వెంకయ్య, మోదీ హోదాపై చేసిన వ్యాఖ్యల విజువల్స్ చూపించిన జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుని నిరసిస్తూ ఏలూరులో యువభేరీ నిర్వహిస్తున్నారు. ఆనాడు హోదాపై ఎన్నో మాటలు మాట్లాడిన వెంకయ్యనాయుడు ఈరోజు మరోలా స్పందిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. మోదీ, వెంకయ్య అధికారం రాకముందుకు అలా ఎందుకు మాట్లాడారు? అధికారంలోకి వచ్చాక ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు హోదాపై తాజాగా స్పందిస్తూ అప్పుడేదో వాడీవేడీ మీద ఉండి అడిగానని చెబుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నాడు ఏపీకి ప్రత్యేక హోదాకు అనుకూలంగా పలు సభల్లో, రాజ్యసభలో వ్యాఖ్యలు చేస్తుండగా తీసిన విజువల్స్‌ని యువభేరీలో జగన్ చూపించారు. మోదీ హోదా గురించి మాట్లాడుతుండగా వెంకయ్య ట్రాన్స్‌లేట్ చేసి మరీ చెప్పారని, పదేళ్లు హోదా కావాలని రాజ్యసభలో అడిగారని నాటి వీడియోను చూపిస్తూ వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాన్ని జగన్ వివరించారు. ఇప్పుడు అదే వెంకయ్యనాయుడు హోదాపై ఇలా మాట్లాడడం భావ్యమేనా అని జగన్ ప్రశ్నించారు.