: జబ్బున పడ్డ చిన్నారుల కోసం రూ. 20 వేల కోట్లను విరాళంగా ఇచ్చిన జుకర్ బర్గ్ భార్య


క్యాన్సర్, గుండెజబ్బులు, అంటు వ్యాధుల బారిన పడ్డ చిన్నారులను చూసి వారి తల్లిదండ్రులు పడే నరకయాతనను ఎన్నో మార్లు ప్రత్యక్షంగా చూసిన ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ సతీమణి ప్రిస్కిల్లా చాన్, ఆ ఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. స్వతహాగా డాక్టర్ అయిన ప్రిస్కిల్లా, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, చిన్నారుల్లో వ్యాధుల నివారణ నిమిత్తం రూ. 20,054 కోట్లను (3 బి. డాలర్లు) విరాళంగా ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇదే సమయంలో 'బయోహబ్' అనే సంస్థ వ్యాధుల నివారణకు చేస్తున్న కృషిని అభినందిస్తూ, 600 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. హెచ్ఐవీ, జికా, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ లను అడ్డుకునే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు సాయం చేయడానికి తాము సిద్ధమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 10 నుంచి 15 పరిశోధనా సంస్థలతో కలసి పనిచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్, ప్రిస్కిల్లా తీసుకున్న దాతృత్వ నిర్ణయాన్ని అభినందించారు.

  • Loading...

More Telugu News