: తన పొజిషన్ నిలుపుకున్న ముఖేష్ అంబానీ... ఫోర్బ్స్ భారత బిలియనీర్ల తాజా జాబితా
ఇండియాలో ఈ యేటి అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. గత సంవత్సరంలో మాదిరిగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తి విలువ 22.7 బిలియన్ డాలర్లని (సుమారు రూ. 1.52 లక్షల కోట్లు) ప్రకటించింది. గత సంవత్సరంలో ఆయన ఆస్తి 18.9 బిలియన్ డాలర్లని పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈక్విటీ విలువ 21 శాతం పెరగడం ముఖేష్ సంపద వృద్ధికి కారణమని వివరించింది. 2015తో పోలిస్తే ఇండియాలోని టాప్-100 బిలియనీర్ల ఆస్తి విలువ 10 శాతం పెరిగి 345 బిలియన్ డాలర్ల నుంచి 381 బిలియన్ డాలర్లకు చేరిందని వెల్లడించింది. బ్రెగ్జిట్ తరువాత, స్థిరంగా సాగుతున్న భారత ఎకానమీ, బిలియనీర్ల సంఖ్యను పెంచిందని, గతంలో ఈ జాబితాలో చేర్చడానికి 1 బిలియన్ డాలర్ల ఆస్తిని ప్రాతిపదికన తీసుకున్నామని, ఈ సంవత్సరం నుంచి దాన్ని 1.25 బిలియన్ డాలర్లకు పెంచామని తెలిపారు. ఇక ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా 16.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.13 లక్షల కోట్లు) ఆస్తితో ఫార్మా దిగ్గజం దిలీప్ సాంఘ్వీ ఉన్నారు. సన్ ఫార్మాస్యుటికల్స్ అధినేతగా ఉన్న దిలీప్ ఆస్తి విలువ గత సంవత్సరంతో పోలిస్తే 1.1 బిలియన్ డాలర్లు తగ్గింది. మూడవ స్థానంలో హిందుజా సోదరులు 15.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.01 లక్షల కోట్లు) ఆస్తితో నిలిచారు. ఆపై అజీం ప్రేమ్ జీ, పల్లోంజీ మిస్త్రి, లక్ష్మీ మిట్టల్, గోద్రేజ్ కుటుంబం, శివ్ నాడార్, కుమార్ బిర్లా, సైరస్ పొన్నావాలాలు టాప్ 10లో నిలిచారు.