: ప్రియురాలి శవం దగ్గర ఏడుస్తూ అసలు విషయం చెప్పిన ప్రియుడు!


పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలి మృతదేహం వద్ద ప్రియుడు ఏడుస్తూ ఆమె చావుకు కారణం వెల్లడించిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పేరేచర్లకు చెందిన బాబావలి ఆటోడ్రైవర్ గా జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. బాబావలి వివాహానికి ముందు మేడికొండూరుకు చెందిన మహిళ (35)ను ప్రేమించాడు. అయితే ఆమెకు గుంటూరుకు చెందిన బేకరీ నిర్వాహకుడు వినయ్‌ కుమార్‌ తో వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే వివాహం జరిగినా ఇద్దరిలోనూ మార్పు రాకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీంతో వీరు రహస్యంగా కలుసుకునేందుకు పేరేచర్లలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. వీరి వ్యవహారం మొత్తం తెలియడంతో ఆమె భర్త ఆమెను నిలదీశాడు. భర్తతో తీవ్రంగా గొడవపడ్డ ఆమె పిల్లల్ని కూడా వదిలేసి ప్రియుడు బాబావలి దగ్గరకు వచ్చేసి అద్దెకు తీసుకున్న రూంలో ఉంటోంది. ఇదే విషయంలో బాబావలి కుటుంబంలో కూడా కలతలు రేగాయి. దీంతో కలిసి బతికేందుకు ఎన్నో ఇబ్బందులున్నాయని భావించిన వారిద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని ఈనెల 17వ తేదీ రాత్రి పురుగుల మందు తాగారు. అయితే ఆమె ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయింది. తక్కువ మోతాదు పురుగుల మందు తీసుకున్న బాబావలికి బతుకు మీద ఆశపెరగడంతో ఆమెను కూడా బతికించుకుందామని భావించి, ఆమెను భుజాన వేసుకుని పేరేచర్ల మెయిన్‌ రోడ్డుకి వచ్చి, అటుగా వెళ్తున్న వ్యాన్‌ లో గుంటూరులోని జీజీహెచ్‌ కు తీసుకొచ్చాడు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, తాను పురుగుల మందుతాగానని చెప్పి అదే ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ సందర్భంగా ఆమె కుటుంబంలో మనస్పర్ధల కారణంగానే తాను పురుగుమందు తాగానని పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాబావలి కూడా ఆత్మహత్యాయత్నానికి అదే కారణం అని చెప్పాడు. చివరికి ఆమె మృతి విషయం తెలుసుకున్న బాబావలి మృతదేహం వద్దకు వచ్చి బోరున విలపిస్తూ అసలు విషయం చెప్పేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News