: హిల్లరీ క్లింటన్.. హాయిగా బజ్జోండి: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై పలు వ్యాఖ్యలు చేస్తూ తన దూకుడుని కొనసాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా హిల్లరీ క్లింటన్‌పై మండిపడుతున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో హిల్లరీ క్లింటన్‌కు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ మరోసారి డే ఆఫ్ తీసుకుంటున్నారని ట్రంప్ అన్నారు. 'హిల్లరీ క్లింటన్, విశ్రాంతి తీసుకొని హాయిగా బజ్జోండి, చర్చలో కలుద్దాం' అని ఆయన ట్వీట్ చేశారు. 'ఆమె లూసియానా వెళ్లలేదు. ప్రస్తుతం మెక్సికోకు కూడా వెళ్లలేదు. దేశాన్ని మళ్లీ అగ్రభాగాన నిలబెట్టడానికి కావలసిన సత్తా క్లింటన్‌లో లేవు' అని ఆయన పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ న్యూమోనియాతో బాధపడుతూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమె కొన్ని రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అయితే, వచ్చే సోమవారం మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది. అందులో ఆమె పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.