: కలిసొచ్చేవారికి స్వాగతం: పొత్తులకు తెరలేపిన ఆవాజ్-ఇ-పంజాబ్
తాను ప్రారంభించిన ఆవాజ్-ఇ-పంజాబ్ రాజకీయ పార్టీ కాదంటూనే, తాము ఇతర సంస్థలతో, రాజకీయ పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. నేడు అమృతసర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమలాగే ఆలోచించే పార్టీలు కలిసి నడిచేందుకు ముందుకు వస్తే సంతోషమని చెప్పారు. విపక్షాల ఓట్లను చీల్చేందుకే సిద్ధూ రాజకీయ పార్టీ పెట్టారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న శిరోమణి అకాలీదళ్, బీజేపీ కూటమిని పడగొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించాలంటే, అధికార పార్టీని ఓడించాలని, అందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాగా, జూలై 18న బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ, ఆవాజ్-ఇ-పంజాబ్ ను ఈ నెల 14న ప్రారంభించిన సంగతి తెలిసిందే.