: తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడకూడదని ఆలోచిస్తున్నారు: విపక్షాలపై మంత్రి లక్ష్మారెడ్డి చురక
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై విపక్షాల తీరు బాగోలేదని రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగిస్తూ ప్రతిపక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడొద్దని ప్రతిపక్ష నేతలు ఆలోచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వకుండా చూడాలనే ఆలోచనే వారికి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు చిత్తశుద్ధి లేదని లక్ష్మారెడ్డి అన్నారు. ప్రాజెక్టుల కోసం సేకరిస్తోన్న భూములపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో కూడా భూములు కోల్పోయారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అవినీతిరహితంగా కొనసాగిస్తోన్న పాలనను తెలంగాణ ప్రజలు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకే సాగునీటి ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు.