: నిజాంపేట్ లో జలదిగ్బంధంలో 50 అపార్ట్‌మెంట్లు... నీట మునిగిన 200 కార్లు, అనేక ద్విచక్రవాహనాలు
హైదరాబాద్ నగరంలో పడుతున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూకట్‌పల్లి, మూసాపేట, నిజాంపేట, కుత్బుల్లాపూర్, బేగంపేట, జగద్గిరిగుట్ట, నాచారం ప్రాంతాలు వర్షాల ధాటికి నీరు నిలిచి చెరువుల్లా కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోకి నీరు చేరుకుంది. నిజాంపేట్ గ్రామపంచాయితీ పరిధిలోని బండారి లేఅవుట్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అందులో దాదాపు 200 అపార్ట్‌మెంట్లు ఉండగా దాదాపు 50 అపార్ట్‌మెంట్లలోకి నీరు వచ్చింది. వాటి సెల్లార్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అందులో పార్కింగ్ చేసిన 200 పైగా కార్లు నీటిలో మునిగిపోయాయి. అనేక ద్విచక్ర వాహనాలది కూడా ఇదే పరిస్థితి. వర్షాల ధాటికి షాట్ సర్క్యూట్ సంభవించకుండా అధికారులు విద్యుత్ తొలగించడంతో నిన్న రాత్రి 9 గంటల నుంచి సదరు అపార్ట్‌మెంట్లు ఉన్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు రాత్రంతా చిమ్మచీకట్లోనే గడిపారు. ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక వారి నిత్యావసరాలను తీర్చడానికి తాళ్ల సహాయంతో పాల ప్యాకెట్లు, మంచినీరు సహా ఇతర సరుకులు అందిస్తున్నారు. తమ దుస్థితిపై అధికారుల నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలో ఉన్న తుర్క చెరువుకు గండిపడిందని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.