: చలో అమరావతి... సచివాలయాన్ని సర్దేస్తున్న అధికారులు!
అక్టోబర్ 3వ తేదీ తరువాత అమరావతి నుంచే పరిపాలన సాగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నేటి నుంచి ఉద్యోగులు, దస్త్రాల తరలింపు ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోను బుధవారం నుంచి తరలింపు ప్రక్రియను ప్రారంభించాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ నుంచి ఆదేశాలు జారీకాగా, ఉద్యోగులు తమ తమ సరంజామాను ప్యాక్ చేశారు. తరలింపు సజావుగా సాగేందుకు ఉద్యోగులందరికి నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెలగపూడిలో ఇప్పటికే తాత్కాలిక సచివాలయ భవనాలు సిద్ధం కాగా, ఈ నెలాఖరుకల్లా తరలింపును పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, అక్టోబర్ లో 1, 2 తేదీలు సెలవు దినాలు కాగా, 3 నుంచి పూర్తి పరిపాలన వెలగపూడి నుంచే సాగనుంది. ఇదిలావుండగా, సెక్రటేరియట్ లో అతి ముఖ్యమైన విభాగాల్లో ఒకటిగా ఉండే సెంట్రల్ రికార్డ్ రూమ్ ను మాత్రం హైదరాబాద్ లోనే ఉంచనున్నారు.