: నువ్వు హిందుస్థానీవి అయితే ఈ ప్రశ్న అడగవు!: విలేకరిపై కపిల్ దేవ్ అసహనం
ఒక విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 7 నుంచి ప్రపంచకప్ కబడ్డీ టోర్నీ జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీ ఆవిష్కరణ సమావేశానికి కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన 'ఈ టోర్నీకి పాక్ జట్టును ఎందుకు ఆహ్వానించలేదు?’ అనే ప్రశ్నకు కపిల్ స్పందిస్తూ.. ‘ఇలాంటి సమయంలో అడగాల్సిన ప్రశ్నేనా ఇది?’ అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ‘నువ్వు హిందుస్థానీవి అయితే ఈ ప్రశ్న అడగవు. ఇటువంటి ప్రశ్నలకు ఇదా సమయం?’ అని కపిల్ అసహనం వ్యక్తం చేశారు. కాగా, యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్రదాడిలో 18 మంది సైనికలు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలోనే కపిల్ అలా స్పందించాడు.