: నా గడ్డం బాగుందా.. చైతన్య గడ్డం బాగుందా?: అభిమానులతో అక్కినేని నాగార్జున
‘నా గడ్డం బాగుందా.. చైతన్య గడ్డం బాగుందా’ అంటూ ప్రముఖ నటుడు నాగార్జున అభిమానులను ప్రశ్నించారు. హైదరాబాదులో జరుగుతున్న ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ‘మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ అయింది. ‘ప్రేమమ్’ అంటే అర్థం ఏంటో ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. సంస్కృతంలో ప్రేమమ్ అంటే ప్రేమ అని అర్థం. సరే.. ఈ సీరియస్ టాక్ మానేసి.. నా గడ్డం బాగుందా? చైతన్య గడ్డం బాగుందా? యాక్చువల్ గా ఈ సినిమా కోసం చైతన్య గడ్డం పెంచినపుడు, ఈ గడ్డం బాగుంది, నేను కూడా ‘ఓం నమో వెంకటేశాయ’కు పెంచితే బాగుంటుందని నాకు అన్పించింది. నేను గడ్డం పెంచిన తర్వాత నా గడ్డమే బాగుందని వాడన్నాడు. నాన్నగారి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’, నా ‘గీతాంజలి’ వరకు ప్రేమ కథా చిత్రాలను అభిమానులందరూ ఎంతగానో ఆదరించారు. ఆ చిత్రాలకు సరిపోయే ప్రేమ కథ ‘ప్రేమమ్’. మలయాళంలో ఈ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అంతే హిట్ ఇక్కడ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. నేను వెంటనే వెళ్లిపోతున్నాను. ఎందుకంటే, ఈరోజు నాన్నగారి జయంతి. నాన్నగారి ఫంక్షన్లలో పాల్గొనాలి. అలాగే, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం షూటింగ్ రేపు ఉంది. దీనికి సంబంధించి పెద్దపెద్ద డైలాగ్ లు ఇచ్చారు.. ఇంటికి వెళ్లి నేర్చుకోవాలి’ అని నాగార్జున అన్నారు. ఈ ఆడియో వేడుకలో దర్శకరత్న దాసరి నారాయణరావు, హీరోయిన్లు శ్రుతిహాసన్, మడోనా, సంగీత దర్శకులు గోపి సుందర్, రాజేష్ మురుగేషన్ తదితరులు పాల్గొన్నారు.