: 'పురపాలిక'ల్లో సత్తా చాటితే మంత్రి పదవి... నేతలకు చంద్రబాబు ఆఫర్!
త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటే వారికి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి దసరాలోగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతల పనితీరును అంచనా వేసి, ఆపై విస్తరణకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కష్టించి పనిచేసే నేతలకు మంచి అవకాశాలను ఇస్తానని ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు, ఎన్నికల తరువాత విస్తరణకు తెరలేపుతారని సమాచారం. ఇక ఏపీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం మినహా మిగతా తొమ్మిది జిల్లాల్లో ఏదో ఒక రూపంలో ఎన్నికలు రానుండగా, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని కూడా చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు మంత్రివర్గాన్ని విస్తరిస్తే, పదవులు రానివారు పూర్తి స్థాయిలో పనిచేయరని, ఎన్నికల తరువాత విస్తరణ అని చెబితే, అందరూ పదవులపై ఆశతో కష్టపడతారని కొందరు సీనియర్లు చేసిన వాదనకు చంద్రబాబు అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.