: కారు నడుపుతూ, మరో యువతితో 'లిప్ లాక్'... వీరంగం సృష్టించిన మహిళ!
ఓ చేత్తో కారు నడుపుతూ, మరోవైపు పక్కనే ఉన్న యువతితో పెదవులు కలిపిన ఓ మహిళ, బెంగళూరు వీధుల్లో ఓ క్యాబ్ ను, మరో స్కూటర్ ను గుద్దేసి వీరంగం సృష్టించింది. బాధితుడు శేఖర్ రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న 30 సంవత్సరాల మహిళ, మరో యువతి కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ అభ్యంతరకరంగా ఒకరిని ఒకరు ముద్దాడుకుంటున్నారు. కారు అదుపు తప్పి తొలుత క్యాబ్ ను, ఆపై స్కూటర్ ను ఢీకొంది. దీంతో తన కారుకు అయిన డ్యామేజ్ ని చూసేందుకు క్యాబ్ డ్రైవర్ శేఖర్ కిందకు దిగగా, కారులో నుంచి వీరిద్దరూ బయటకు రాకుండా తమ పనిలో తామున్నారు. వారి వద్దకు వెళ్లి యాక్సిడెంట్ పై ప్రశ్నించగా, ప్రమాదానికి క్యాబ్ డ్రైవరే కారణమని, తాను నిదానంగానే వస్తున్నానని సమాధానమిచ్చిన మహిళ, కారును టర్న్ తీసుకుని ముందుకు వెళ్లిపోయింది. ఇదే ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ స్కూటరిస్టు ఫర్హాన్ తో కలసి శేఖర్ తన వాహనంలో కారును చేజ్ చేసి పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కారులోని యువతులకు మద్యం పరీక్షలు నిర్వహించగా, నెగటివ్ రిపోర్టు వచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా, తామేమీ అభ్యంతరకర భంగిమల్లో లేవని, తన పక్కనున్న యువతి కంట్లో నలక పడటంతో, ఊదుతున్న సమయంలో, ప్రమాదం జరిగిందని సదరు మహిళ చెప్పడం గమనార్హం.