: ఢిల్లీ డిప్యూటీ సీఎంను ప్రశ్నించనున్న ఏసీబీ


ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు నోటీసులు ఇస్తామని ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా పేర్కొన్నారు. ఢిల్లీ మహిళ కమిషన్‌లో జ‌రిగిన‌ నియామకాల్లో అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఎన్నో ఆరోపణలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న ఏసీబీ తాజాగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాల‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలిస్తోన్న ఏసీబీ అందులో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ప్ర‌తి ఒక్క‌రినీ ప్ర‌శ్నించాల‌ని నిర్ణ‌యించుకుంది. యాంటీ క‌రెప్ష‌న్ యాక్ట్‌లోని సెక్షన్ 13 (డి), ఐపీసీలోని 409, 120బి, సెక్షన్ల కింద స్వాతి మలివాల్‌పై కేసులు నమోదు చేసిన ఏసీబీ, ఢిల్లీ డిప్యూటీ సీఎంని కూడా ఈ కేసులో ప్ర‌శ్నించ‌నుంది. ఈ కేసులో స్వాతిపై నిన్న అధికారులు ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు. మ‌రో 27 ప్రశ్నలను ఆమె ముందు ఉంచి వాటికి ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాల‌ని సూచించారు. స్వాతి కన్నా ముందు ఆ శాఖ‌లో చైర్‌పర్సన్‌గా ఉన్న‌ బర్ఖా శుక్లా సింగ్ చేసిన ఫిర్యాదుతో ఏసీబీ ఈ కేసులో ముందుకువెళుతోంది. బర్ఖా శుక్లా సింగ్ చేసిన ఫిర్యాదులో మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నిబంధనలకు విరుద్ధంగా నియ‌మిస్తున్నార‌ని పేర్కొన్నారు. అందులో 85 మంది పేర్ల‌ను కూడా ఆమె అధికారుల ముందు ఉంచారు. ఈ సంద‌ర్భంగా స్వాతి మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ మహిళా కమిషన్‌లో అంతమందిని ఎలా నియమించారంటూ ఏసీబీ అధికారులు తనను అడిగిన‌ట్లు తెలిపారు. నవీన్ జైహింద్ అనే వ్య‌క్తి ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. న‌వీన్ భార్యే ఆ శాఖ చైర్‌ప‌ర్స‌న్‌ స్వాతి!

  • Loading...

More Telugu News