: విమానంలో ఆశారాం బాపూ, ఆయన అనుచరుల హంగామా!
తనను తాను దేవుడిగా చెప్పుకుని, ఆపై అత్యాచార ఆరోపణలపై జైల్లో కాలం గడుపుతున్న ఆశారాం బాపూను వైద్య పరీక్షల నిమిత్తం జోధ్ పూర్ జైలు నుంచి ఢిల్లీకి తీసుకు వెళుతున్న సమయంలో, ఆయన అనుచరులు జెట్ ఎయిర్ వేస్ విమానంలో హల్ చల్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆశారాంకు వైద్య పరీక్షలకు కోర్టు అనుమతించడంతో పది మంది పోలీసులు ఎస్కార్టుగా జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యూ 2552లో ఆయన్ను తీసుకువెళ్లారు. అదే విమానంలో టికెట్లు బుక్ చేసుకుని ఎక్కిన ఆశారాం అనుచరులు విమాన ప్రయాణం సాగినంత సేపూ హంగామా చేస్తూనే ఉన్నారు. ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. ఇదే సమయంలో విమానంలో గాలి సరిగ్గా ఆడక తామెంతో ఇబ్బంది పడ్డామని ప్రయాణికులు తెలిపారు. ఆశారాం భక్తులెవరూ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో సీట్లలో కూర్చోలేదని, ఒకరిద్దరు కూర్చున్నా వారు సీట్ బెల్టులు పెట్టుకోలేదని ఓ ప్యాసింజర్ తెలిపారు. వారిని కూర్చోమని అడిగితే, స్వయంగా భగవంతుడు మనతో ప్రయాణం చేస్తుంటే, కూర్చోవడం ఎందుకు? అన్న ప్రశ్న ఎదురైనట్టు తెలిపారు. ఇక ప్రయాణమంతా 'ఆశారాం బాపూకీ జై' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారని అదే విమానంలో ప్రయాణించిన స్వాతి వెల్లడించారు. తన జోథ్ పూర్ ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికను రేప్ చేసిన ఆరోపణలపై 2013 ఆగస్టు 20 నుంచి ఆశారాం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.