: యూరీ దాడిపై ప్రశ్నించిన ఎన్డీటీవీ విలేకరిపై నవాజ్ షరీఫ్ ఆగ్రహం .. 'ఇస్ ఇండియన్ కో నికాలో' అంటూ ఆదేశించిన పాక్ ప్రధాని
ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ యూరీ ఉగ్రదాడి ఘటనపై మీడియా ప్రశ్నిస్తున్న సమయంలో, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పిన ఆయన, తనను ప్రశ్నించిన ఎన్డీటీవీ విలేకరి నమ్రతా బ్రార్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోజ్ వెల్ట్ హోటల్ లో మీడియా సమావేశానికి వచ్చిన షరీఫ్ ను యూరీ దాడిపై స్పందించాల్సిందిగా నమ్రత కోరారు. ఆ వెంటనే "ఇస్ ఇండియన్ కో నికాలో" (ఈ ఇండియన్ ను పంపించండి) అన్నారు. దీంతో అధికారులు ఆమెను పంపివేశారు. ఆపై మీడియా సమావేశానికి ఒక్క భారతీయ విలేకరిని కూడా అనుమతించలేదు. ఆపై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాత పాటే పాడారు. పాక్ కేంద్రంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ నడుపుతున్న జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు యూరీ ఆర్మీ బేస్ పై దాడి చేయగా, 20 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.