: మోదీ, బాబు... ఈ ఇద్దరి జోడీ అభివృద్ధికి దోహదం చేస్తుంది : వెంకయ్యనాయుడు
ఢిల్లీలో మోదీ, రాష్ట్రంలో బాబు.. ఈ ఇద్దరి జోడీ అభివృద్ధికి దోహదం చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నెమ్మలూరులో బెల్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక సంస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. రూ.6 వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైందన్నారు. రాత్రి సమయంలో 3 కిలో మీటర్ల దూరం చూడగలిగే లెన్స్ ను బెల్ పరిశ్రమ తయారుచేస్తోందన్నారు. ఈ సంస్థ ఉత్పతుల్లో 87 శాతం రక్షణ శాఖకు చెందినవే అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు నేతలు ఏపీకి ప్రత్యేకహోదా తప్ప మరేమీ అక్కర్లేదని అంటున్నారన్నారు. హోదాతోపాటు 28 కోరికలు కోరితే, వాటిలో 27 కోరికలు నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.