: ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు రావు: విజయవాడలో సుజనా చౌదరి
కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సాయం గురించి ప్రజలకు మీడియా వివరించి చెప్పే ప్రయత్నం చేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి కోరారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రం రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కేంద్ర ప్రకటనతో పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని, అది పూర్తయితే రైతులకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమేనని, హోదాతో ఉద్యోగాలు రావని సుజనా చౌదరి చెప్పారు. హోదా వస్తే అది వచ్చిందన్న పేరే తప్ప, అంతకు మించి రాష్ట్రానికి ఏమీ రాదని ఆయన పేర్కొన్నారు. హోదాతో సమానంగా వచ్చే సాయంతో పాటు ఇప్పుడు మనకి ప్రత్యేక ప్రయోజనాలు కూడా అందుతాయని ఆయన అన్నారు. హోదాతో సమానంగా సాయం చేస్తామని కేంద్ర మాటిచ్చిందని చెప్పారు. ప్యాకేజీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సూచనల వల్ల హోదా రాలేదని చెప్పారు.