: జమ్మూలో భీకర ఎన్ కౌంటర్... రష్యా పర్యటనను వాయిదా వేసుకుని ఎమర్జెన్సీ మీటింగ్ కు హాజరైన రాజ్ నాథ్
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నలుగురు జమ్మూలోని యూరీ సెక్టారులో ఫిదాయీ ఉగ్రదాడికి దిగడంతో, జమ్మూలో భీకర్ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి, కాల్పులు జరుపుతుండడంతో వారిని మట్టుబెట్టడంలో సైన్యం విఫలమవుతుండగా, ఇప్పటివరకూ ముగ్గురు జవాన్లు వీరమరణం పొందినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ల సాయంతో పారామిలిటరీ జవాన్లను ఘటనా స్థలికి పంపారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, తన రష్యా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. యూరీ సెక్టారులో ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.