: బ్రిటన్ పోలీసులు నా శరీరంలో చిప్స్ పెట్టారు.. వాటిని తొలగించండి ప్లీజ్.. ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఎన్నారై


బ్రిటన్ పోలీసులు గూఢచర్యం కోసం తన శరీరంలో కంప్యూటర్ చిప్స్ పెట్టారని, వాటిని తొలగించాలని కోరుతూ ఎన్నారై హరీందర్ పాల్ సింగ్ హోం మంత్రిత్వ శాఖను కోరారు. మూడేళ్ల క్రితం బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన ఇటీవల ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత హాకీ మాజీ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత జగ్జిత్ సింగ్ కుమారుడు అయిన హరీందర్ మాట్లాడుతూ తన శరీరంలో బ్రిటన్ పోలీసులు అమర్చిన చిప్స్‌ను తొలగించాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖను కోరినట్టు తెలిపారు. ఆయన రిక్వెస్ట్‌ను ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పంజాబ్ సర్కారు ఈ విషయాన్ని జలంధర్ డిప్యూటీ కమిషనర్ కేకే యాదవ్‌కు తెలిపి ఈ విషయాన్ని చూడాల్సిందిగా ఆదేశించింది. సన్సాపూర్‌కు చెందిన హీరందర్ మాట్లాడుతూ తన అమ్మమ్మతో కలిసి 1987లో 15 ఏళ్ల వయసులో బ్రిటన్ వెళ్లినట్టు చెప్పారు. ఓ రోజు తాను గదిలో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి, తనకు స్పృహ తప్పేలా చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత తన శరీరంలో కొన్ని పరికరాలను అమర్చారని పేర్కొన్నారు. 1996లో తన నాలుగేళ్ల కుమార్తె ప్రమాదంలో మరణిస్తే దానిని హత్యగా మార్చి తనను జైలులో పెట్టారని హరీందర్ పేర్కొన్నారు. 15 ఏళ్ల జైలు శిక్షను పూర్తిచేసుకుని ఫిబ్రవరి 13, 2013లో అక్కడి నుంచి తిరిగి స్వదేశం చేసుకున్నట్టు ఆయన వివరించారు. కాగా హరీందర్‌కు జలంధర్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి ఆయన శరీరంలో చిప్స్ ఉన్నవీ లేనిదీ నిర్ధారించనున్నారు.

  • Loading...

More Telugu News