: ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కేజ్రీవాల్ నాలుకను చీరేశారు: మనోహర్ పారికర్ వ్యంగ్యం
ఉండాల్సిన పరిమాణం కన్నా అధికంగా ఉన్న తన నాలుకకు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శస్త్ర చికిత్స చేయించుకున్న వేళ, రక్షణమంత్రి మనోహర్ పారికర్ తనదైన శైలిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నందునే ఆయన నాలుకను చీరేశారని అన్నారు. "ఢిల్లీలో ఆయన ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఇక్కడికి (గోవాకు) వచ్చి నాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తారు. ఆయన నాలుక మందమైపోయింది. ఇప్పుడు దాన్ని తగ్గించారు" అని గోవాలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన విమర్శించారు. తర్వాత తన వ్యాఖ్యలు శస్త్రచికిత్స చేయించుకుంటున్న వ్యక్తిని ఎద్దేవా చేస్తున్నట్టు ఉండటంపై విమర్శలు వస్తాయని భావించారో ఏమో, పారికర్ ఆపై వెంటనే... "ఆరోగ్యం బాగాలేక సిక్ లీవులో ఉన్న కేజ్రీవాల్ పై నాకు సానుభూతి ఉంది" అన్నారు. కేజ్రీవాల్ ప్రారంభించిన మోహల్లా క్లినిక్స్ సరిగ్గా పనిచేస్తుంటే, చికున్ గున్యాతో 40 మంది మరణించే వారు కాదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకునేందుకు ఆయన రూ. 26.82 కోట్లు ఖర్చు పెట్టారని, అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు.