: నటితో నదిలో ఈతకు వెళ్లిన బ్రెజిల్ నటుడి దుర్మరణం
బ్రెజిల్ టీవీ రంగంలో అగ్రశ్రేణి నటుడు డొమింగోస్ మాంటెగ్నర్ దుర్మరణం పాలయ్యాడు. సర్కస్ కళాకారుడిగా జీవితం ప్రారంభించిన డొమింగోస్, రంగస్థల నటుడిగా రాణించి, తరువాత టీవీ కళాకారుడిగా ఆకట్టుకుని స్టార్ యాక్టర్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఓ టీవీ సీరియల్ షూటింగ్ నిమిత్తం కానిండ్లే అనే గ్రామానికి వెళ్లిన డొమింగోస్, విరామ సమయంలో గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న సావ్ ఫ్రాన్సిస్కో నదిలో సహనటి కామిల్లా పిటాంగాతో కలిసి సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లారు. వీరిద్దరూ అలా జలకాలాటలలో మునిగి ఉండగానే, అకస్మాత్తుగా ప్రవాహ తీవ్రత పెరగడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. కామిల్లాకు బండరాయి దొరకడంతో దానిపైకి ఎక్కి అతనిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా, ఘటన జరిగిన మరుసటి రోజు గల్లంతైన ప్రదేశానికి 1000 అడుగుల దూరంలో, నీటి ప్రవాహానికి 60 అడుగుల లోతున బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన డొమింగోస్ మృతదేహం లభ్యమైంది. కాగా, ఆయన ఈతకు దిగిన ప్రాంతం అంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ ప్రవాహ వేగం కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సాధారణమేనని వైద్యులు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలో డొమింగోస్ మృత్యువాతపడడం దురదృష్టకరమని లీగల్ మెడికల్ ఇన్స్ స్టిట్యూట్ డైరెక్టర్ జోస్ కార్దోస్ తెలిపారు.