: మోదీ మేనియా రోజురోజుకీ పెరిగిపోతోందన్న అమిత్ షా.. కాసేపట్లో వరంగల్ బహిరంగ సభలో పాల్గొననున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు
వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నిర్వహించతలపెట్టిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శంషాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని వరంగల్‌కి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు సేవా దినోత్సవంగా జరుపుతున్నారని అన్నారు. మోదీ మేనియా రోజురోజుకీ పెరుగుతూనే ఉందని అన్నారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహిస్తోన్న సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. తెలంగాణ చరిత్రను తెలియజేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందని పార్టీ నేతలు మీడియాకు తెలిపారు. అమిత్ షా రాకతో హన్మకొండలో బీజేపీ శ్రేణుల కోలాహలం కనిపిస్తోంది. సభలో పాల్గొన్న అనంతరం అమిత్ షా వరంగల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని రేపు ఉదయం ఆయన మళ్లీ ఢిల్లీకి బయల్దేరనున్నారు.