: మీ ఇంట్లో వారినైనా, బయటి వారినైనా ఒకేలా చూడాలి!: అధికారుల‌పై చంద్రబాబు ఆగ్రహం


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌భుత్వాధికారులపై మండిప‌డ్డారు. అంటువ్యాధుల నియంత్రణపై అమ‌రావ‌తి నుంచి ఆయ‌న టెలీకాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, జిల్లాల యంత్రాంగం, గ్రామ సర్పంచులతో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ్యాపిస్తోన్న అంటువాధ్యులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న ఈ రోజు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌జారోగ్యం క్షీణిస్తోంటే సంబంధిత‌ అధికారులు క‌ట్టుక‌థ‌లు చెప్పి త‌ప్పించుకోవ‌ద్ద‌ని అన్నారు. ప్ర‌జ‌లు డెంగ్యూతో బాధ‌ప‌డుతోంటే అధికారులలో చలనం ఉండ‌దా? అని ప్ర‌శ్నించారు. అధికారి హోదాలో ఉన్న‌వారు త‌మ ఇంట్లో వ్య‌క్తుల‌న‌యినా, ఊరిలో వారినైనా ఒక్కటిగానే చూడాల‌ని చంద్రబాబు అన్నారు. అటువంట‌ప్పుడే ప్ర‌జ‌లు అధికారులు, సిబ్బంది నుంచి మంచి సేవలు అందుకుంటార‌ని హిత‌వు ప‌లికారు. ఇకపై ప్రతి శనివారం ఆరోగ్య దినంగా పాటించాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు చిన్నారులు జ్వ‌రాల‌తో చ‌నిపోవ‌డం ప‌ట్ల ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించ‌ని సంబంధిత అధికారులను కూడా తీవ్రంగా హెచ్చ‌రించారు. మ‌రోసారి అటువంటి ప‌రిస్థితి రాష్ట్రంలో పునరావృతం కాకూడ‌ద‌ని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చ‌ర్య‌లు స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టాల‌ని చంద్రబాబు ఆదేశించారు. తాము ఆకస్మిక తనిఖీలు చేసి విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌నివారిపై క‌ఠిన చర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. రేపటినుంచే సంబంధిత‌ మంత్రులు, కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో త‌నిఖీల్లో పాల్గొనాల‌ని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్య పరచడానికి అధికారులు ముందుకురావాల‌ని ఆదేశించారు.

  • Loading...

More Telugu News