: పేరు కోసం గొడవలు సరికాదు.. అందరికీ న్యాయం చేస్తా: కాపు విద్యార్థులతో చంద్రబాబు
అందరికీ న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని, కాపులకు తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విదేశీ విద్యతో పాటు కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం అందిస్తున్న సాయంపై కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దేన్నైనా మంచిగా సాధించుకోవాలని తాను ఆలోచిస్తుంటే కొందరు పేరు కోసం గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలనే పట్టుదల తనకు ఉందన్నారు. వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తనదేనంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చాలామంది స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని, కానీ తనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. పేదలు ఎక్కడుంటే అక్కడుండే పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. కాపుల్లోనూ పేదలు ఉన్నారని, పాదయాత్ర సమయంలో ఆ విషయం అర్థమైందన్నారు. వారిని బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చింది అందుకేనని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానని, వెనక్కు పోయే ప్రస్తక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం రూ. వెయ్యికోట్లు కేటాయించామని పేర్కొన్న బాబు సర్వే అనంతరం కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు. విదేశీ విద్య కోసం 400 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఇప్పటికే 359 మందిని విదేశాలకు పంపించినట్టు తెలిపారు. ప్రతి విద్యార్థిని చదివించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.