: రూ.2.25 కోట్ల విలువ చేసే ఐ ఫోన్ల చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
ట్రక్కు డ్రైవర్ ను చితకబాది సుమారు రూ.2.25 కోట్ల విలువ చేసే 900 ఐఫోన్లను ఎత్తుకెళ్లిన సంఘటనలో నిందితుల్లో ఇద్దరిని పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఈ నెల 13న ఢిల్లీలోని వోక్లా ప్రాంతం నుంచి ద్వారకకు 900 ఐ ఫోన్లు (5 ఎస్)లను ట్రక్కు ద్వారా తరలిస్తున్నారు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ ట్రక్కును ద్వారకా లింకు రోడ్డు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ పై దాడి చేసి, పక్కనే ఉన్న చెరువులోకి అతన్ని తోసేశారు. ఆ తర్వాత ట్రక్కులో ఉన్న 900 ఐ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు మెహ్తాబ్ ఆలం, అర్మన్ లను వేర్వేరుచోట్ల నిన్న అరెస్టు చేశారు. నిందితులిద్దరిని మహిపాల్ పూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. భోలా, ప్రదీప్, రాహుల్ జితేందర్ అనే వ్యక్తులతో కలిసి తాము ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.