: పోలీసులు టార్గెట్ చేశారని తెలుసుకుని లొంగిపోవాలని చూసిన నయీమ్: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
తనను పోలీసులు టార్గెట్ చేశారని తెలుసుకున్న నయీమ్, మరో ముగ్గురితో కలసి లొంగిపోవాలని చూశాడని బీసీ సంఘాల నేత, హైదరాబాదు, ఎల్బీ నగర్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, నయీమ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. నయీమ్ తో తనకు మొదటి నుంచి సంబంధాలున్నాయని, అయితే అవి ఆర్థికపరమైనవి కాదని, బెదిరింపులకు, కబ్జాలకు చెందినవి అంతకన్నా కాదని అన్నారు. పలువురు నయీమ్ బాధితులు తనతో మాట్లాడిన సమయంలో, తాను నయీమ్ కు ఫోన్ చేసి పేదల జోలికి వెళ్లొద్దని హెచ్చరించినట్టు కృష్ణయ్య తెలిపారు. భువనగిరిలో జరిగిన ఉర్సు, వినాయక ఉత్సవాలకు నయీమ్ ఆహ్వానం మేరకు వెళ్లి రెండుసార్లు పాల్గొన్నానని గుర్తు చేశారు. నయీమ్ కేసులో విచారిస్తున్న అధికారులకు సహకరిస్తానని చెప్పారు.