: ప్యాకేజీని చంద్రబాబు అర్థం చేసుకున్నట్టే పవన్ కల్యాణ్ కూడా అర్థం చేసుకోవాలి: ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంట్‌గా మారిన ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ సర్కారుపై వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. దాని కోసం తాము ప్రణాళిక రూపొందించుకున్నట్లు బీజేపీ ఏపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయాన్ని వివరిస్తూ ప్యాకేజీ వివరాలను ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఈ నెల 22న రాజమండ్రిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటిస్తారని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకున్నట్టే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అర్థం చేసుకోవాలని సోము వీర్రాజు సూచించారు. బహిరంగ సభల్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు.