: జీరో బ్యాలెన్స్ ఖాతాలను గట్టెక్కించడానికి.. జన్ ధన్ ఖాతాల్లో 'రూపాయి' చొప్పున వేసిన బ్యాంకులు!
నరేంద్ర మోదీ మానస పుత్రికగా ఘనంగా ప్రారంభమై విజయవంతమైన జన్ ధన్ ఖాతాల అసలు ఉద్దేశం నీరుగారే పరిస్థితి తలెత్తిన వేళ, బ్యాంకులు స్పందించి, ఒక్కో ఖాతాలో ఒక్క రూపాయి చొప్పున డిపాజిట్ చేశాయి. అసలు విషయం ఏంటంటే, 2014లో మోదీ ప్రధానిగా బాధ్యత చేపట్టిన మూడు నెలల తరువాత తొలి రోజున 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలతో జన్ ధన్ యోజన ప్రారంభమైంది. దేశంలోని పౌరులందరినీ బ్యాంకింగ్ గొడుగు కిందకు తీసుకురావాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇక ఇప్పటికి జన్ ధన్ కింద 22 కోట్లకు పైగా ఖాతాలు ప్రారంభమయ్యాయి. సమస్య ఎక్కడ మొదలైందంటే, కొన్ని లక్షల ఖాతాల్లో ఎలాంటి నగదు నిల్వలూ లేవు, వాటిల్లో జీరో బ్యాలెన్స్ కొనసాగుతుండటం, ఇవన్నీ చలనరహిత స్థితిలోకి వెళ్లిపోతుండంతో తమపై వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు బ్యాంకర్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలో రూపాయిని జమ చేయడం ద్వారా టెక్నికల్ గా, సున్నా నిల్వ ఖాతాల సంఖ్యను తగ్గించడంతో పాటు ఏదో ఒక లావాదేవీ జరిపినట్టు చూపి మరికొంత కాలం ఆ ఖాతాను యాక్టివ్ గా ఉంచవచ్చు. 18 ప్రభుత్వ, 16 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇదే మార్గాన్ని అవలంబించి 1.05 కోట్ల ఖాతాల్లో 'రూపాయి'లను వేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులోని 29 శాతం ఖాతాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలోని 9.26 శాతం ఖాతాల్లో యూకో బ్యాంకులోని 14.83 శాతం ఖాతాల్లో ఒక రూపాయి డిపాజిట్లు ఉన్నాయి. ఈ డబ్బును ఎంటర్ టెయిన్ మెంట్ అలవెన్స్, ఆన్ లైన్ లావాదేవీల నుంచి వచ్చే ఫీజులు, క్యాంటీన్ సబ్సిడీ నుంచి సర్దుబాటు చేశామని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. తమ ఖాతాల్లో ఇలా డబ్బు జమ అయినట్టు ఖాతాదారులకు తెలియకపోవడం గమ్మత్తైన అంశం.