: శ్రీశైలానికి వరద... గంటల వ్యవధిలో లక్ష క్యూసెక్కులకు!
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండి నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందకు వదులుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతుండగా, ఆ నీరంతా శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. నిన్న మధ్యాహ్నం 5 వేల క్యూసెక్కులు కూడా లేని నీటి ప్రవాహం ప్రస్తుతం 86,350 క్యూసెక్కులకు చేరగా, ఇది మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి 4,680 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 870.3 అడుగుల నీరుంది.