: అఖిలేష్ యాదవ్ పై రాహుల్ గాంధీ సెటైర్లు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అలహాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ, సమాజ్ వాది పార్టీ గుర్తు అయిన ‘సైకిల్’ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సెటైర్లు వేశారు. పాడైపోయిన సైకిల్ కు టైర్లు మార్చేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారని, సైకిల్ రిపేర్ కు ఇప్పటికే చాలా ఆలస్యమైందని, నాలుగున్నరేళ్ల పాలనను వృథా చేశారని రాహుల్ విమర్శించారు. రాష్ట్రంలో అఖిలేష్ పాలన చాలా దారుణంగా ఉందని, దెబ్బతిన్న ప్రభుత్వ ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. బడా వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు.