: ప్రపంచంలోని టాప్-5 కంపెనీల్లో నాలుగు కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి: మంత్రి కేటీఆర్
ఐటీ రంగంలో నిపుణులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని హెచ్ఐసీసీలో ఈరోజు డేటా అనాలసిస్ పాలసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న కేటీఆర్ సైబర్ సెక్యూరిటీ, డేటా పాలసీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధి అవకాశాల కోసం అత్యధిక శాతం యువత ఐటీ రంగం వైపు చూస్తోందని పేర్కొన్నారు. ఐటీ రంగం యువతకు వేల ఉద్యోగాలను అందిస్తోందని చెప్పారు. వేల ఉద్యోగ అవకాశాలను బిగ్ డాటా అందిస్తుందని కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు రెండున్నరేళ్లుగా తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్-5 కంపెనీల్లో నాలుగు కంపెనీలు హైదరాబాద్‌లో బ్రాంచీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇది తమ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో డేటా అనాలసిస్ పాలసీలు కీలకం కాబోతున్నాయని అన్నారు. సైబర్ సెక్యూరిటీ అన్ని ప్రభుత్వాలకు కీలకంగా మారనుందని చెప్పారు. తయారీ రంగంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు.