: చరిత్రలో తొలిసారి ఇలా... మిన్నంటిన జయజయధ్వానాల మధ్య తల్లి ఒడికి చేరిన మహా గణపతి
ఆరు దశాబ్దాల క్రితం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పడిన తరువాత, జంటనగరాల్లో ప్రతియేటా నిర్వహించే వినాయకచవితి ఉత్సవాల్లో తొలిసారిగా ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం తొలిరోజు మధ్యాహ్నానికే పూర్తయింది. క్రేన్ సాయంతో నిదానంగా పైకి లేచిన విఘ్నాధిపతి, తిరిగి వచ్చే సంవత్సరం వస్తానంటూ, సరిగ్గా మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తరలివచ్చిన అశేష భక్తజనం జయజయధ్వానాల మధ్య ఈ కార్యక్రమం కన్నుపండువగా సాగింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని ఒంటిగంటలోగా పూర్తి చేయిస్తామని ముందే చెప్పిన పోలీసు అధికారులు అందుకు తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో వ్యవహరించి భారీ వినాయకుని నిమజ్జనాన్ని సాఫీగా పూర్తి చేయించారు. ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన వినాయకుడు ఇలా మధ్యాహ్నానికే ట్యాంక్ బండ్ చేరడం, వేలాది విగ్రహాలకన్నా ముందే నిమజ్జనం కావడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతి సంవత్సరమూ ఇలాగే చేస్తే, తదుపరి వచ్చే విగ్రహాల ఊరేగింపుపై ఒత్తిడి ఉండదని అంటున్నారు.