: నడిగర్ సంఘం భవన నిర్మాణం నిర్ణయంపై పిటిషన్... కమలహాసన్, నాజర్, విశాల్ లకు మద్రాస్ హైకోర్టు నోటీసులు
దక్షిణ భారత చిత్ర ప్రముఖుల సంఘమైన నడిగర్ సంఘం భవన నిర్మాణ డీల్ వ్యవహారంలో సినీ నటులు కమలహాసన్, నాజర్, విశాల్ సహా తొమ్మిది మందికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాంబరం ప్రాంతానికి చెందిన నడిగర్ సంఘం సభ్యుడు వారాహి, హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ, భవన నిర్మాణ నిర్ణయం ఏకపక్షమని, తమతో చర్చించకుండానే, బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించాడు. వెంటనే డీల్ రద్దు చేయాలని కోర్టును కోరగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్, ట్రెజరర్ కార్తి, ట్రస్ట్ సభ్యులుగా ఉన్న కమల్, కుట్టి పద్మిని, ఎస్వీ శేఖర్, పూచి మురుగన్ తదితరులకు నోటీసులు ఇస్తూ, 19వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.