: చిగురుటాకులా వణికిన హైదరాబాద్... రాత్రంతా వర్షంతో తీవ్ర ఇబ్బందులు!


గత రాత్రి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించగా, ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాంనగర్ నాలా పొంగిపొరలుతుండటంతో నాగమయ్య కుంటలోని గుడిసెలు నీట మునిగాయి. వరద నీటిలో మునిగి నారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. చిక్కడపల్లి అంబేద్కర్ కాలనీలో ఇల్లు కూలింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించడంతో, మునిసిపల్ శాఖమంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ లు పరిస్థితిని సమీక్షించారు. 24 గంటలూ యాక్షన్ టీములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి వరదలు తోడు కావడంతో ఆరుగురు గల్లంతయ్యారు. ఓ కారు, మరో బైకు కొట్టుకుపోయాయి. వికారాబాద్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి గండిపేట చెరువులో 10 అంగుళాల మేరకు, హిమాయత్ సాగర్ లో 3 అంగుళాల మేరకు నీరు పెరిగింది. నల్గొండ జిల్లాలో వరుసగా మూడవ రోజూ భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు పొంగి పొరలుతుండగా, చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. కాగా, మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News