: మా అన్నయ్య మాటను కాదనే ధైర్యం ఎవరికుంది?: ములాయం సోదరుడు శివపాల్
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్న వేళ, తన అన్నను కలిసిన శివపాల్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ములాయంను వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదని, తన అన్న ఏది చెబితే అది చేస్తానని అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీకి వెళ్లి అన్న ములాయంతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వెంట రాంగోపాల్ యాదవ్ ను సైతం తీసుకెళ్లారు. అనంతరం మాట్లాడుతూ, పార్టీ పరిస్థితిని ఆయనకు వివరించానని, ములాయంపై తనకెంతో విశ్వాసం ఉందని తెలిపారు. పోర్టు ఫోలియోలు ఇవ్వడం, తొలగించడం ముఖ్యమంత్రిగా అఖిలేష్ ఇష్టమని తెలిపిన ఆయన, ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిర్ణయాలు కీలకమని, పార్టీకి సంబంధించి ములాయం మాటే వేదవాక్కని అన్నారు. కాగా, అఖిలేష్ క్యాబినెట్ రద్దు కానుందని వార్తలు వస్తున్న వేళ ఢిల్లీకి బయలుదేరిన అఖిలేష్, ఈ సాయంత్రం తన తండ్రిని కలవనున్నారు.