: ఇంట్లోనే దాక్కున్న యువతి... 5 గంటల పాటు పోలీసులు, తల్లిదండ్రుల హైరానా!


ప్రేమ విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో, ఓ యువతి ఊరందర్నీ ఉరుకులు పరుగులు పెట్టించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం పట్టణంలోని సారంధినగర్ లో నివాసం ఉంటున్న ఓ విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిని మందలించారు. ఆ మర్నాడు తెల్లారి లేచి చూసేసరికి యువతి కనిపించలేదు. దీంతో ఇంటి చుట్టుపక్కల వెతికారు.. స్నేహితుల ఇళ్లకి వెళ్లిందేమోనని ఆరాతీశారు.. బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా కనిపించలేదు. ఆమె మొబైల్ కి ఫోన్ చేస్తే, రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. వెంటనే ఆమె ప్రేమించిన యువకుడింటికి వెళ్లి ఆరాతీయగా అతను కూడా ఊర్లో లేడని సమాధానం వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ కలసి వెళ్లిపోయారన్న ఆందోళనతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. పోలీసు విచారణలో యువతి ప్రియుడు తాను సారపాకలో ఉన్నానని, తనకు ఆమె విషయం తెలియదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా ఆమె కోసం తీవ్రంగా వెతికారు. సుమారు 5 గంటల పాటు ఈ తతంగం నడిచింది. దీంతో యువతి మొబైల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ట్రాక్ చేయగా వారుంటున్న ప్రాంతంలోనే ఆమె ఉన్నట్టు వెల్లడైంది. దీంతో మళ్లీ వెతుకులాట ప్రారంభించారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు యువకుడ్ని గట్టిగా హెచ్చరించడంతో యువతికి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పి, ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడింది. తనింట్లోనే ఉన్నానని కూడా సమాధానం చెప్పింది. ఇదే విషయాన్ని పోలీసులకు యువకుడు చెప్పడంతో మరింత ఆగ్రహానికి గురైన పోలీసులు, అతన్ని గట్టిగా నిలదీశారు. దీంతో మళ్లీ యువతికి ఫోన్ చేసిన ఆమె ప్రియుడు, ఆమె ఎక్కడుందో కనుక్కుని పోలీసులకు ఫోన్ చేశాడు. ఆమె తన ఇంట్లోనే ఉందని, మేడమీద కూలర్ లో దాక్కుందని చెప్పాడు. దీంతో ఆమె ఇంటి మేడమీదికి వెళ్లిన పోలీసులు, కూలర్ లో కూర్చున్న యువతిని బయటకు తీసి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తర్వాత ఆమెకు, ఇలాంటి పనులు చేయకూడదని, ఏ విషయం గురించి అయినా తల్లిదండ్రులతో సూటిగా మాట్లాడుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు వెళ్లిపోయారు. అలా అందర్నీ కొన్ని గంటల పాటు హడలెత్తించిన యువతి కథ సుఖాంతం అయింది.

  • Loading...

More Telugu News