: మాయదారి మందులు అమ్మడానికి కుదరదిక!
మనుషుల అనారోగ్యాన్ని బాగుచేయలేకపోయినా, ఉన్న ఆరోగ్యాన్ని కుళ్లబొడిచే మందులను అమెరికా ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. వాటిని వెంటనే నిషేధిస్తుంది. బ్రిటన్ కూడా ఇంచుమించు ఇలాగే ప్రజారోగ్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. మరి ఆయా దేశాలలో నిషేధించిన మందులెన్నో మన భారతీయ మార్కెట్లో యధేచ్చగా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తూనే ఉన్నాయి. కానీ అన్నీ అనుకూలిస్తే మాయదారి మందులను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి అవకాశం ఉండదిక!
అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాలలో నిషేధించిన మందులను వెంటనే దేశీయ మార్కెట్లోనూ నిషేధిస్తారు. ఇందుకోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తగిన విధానాన్ని రూపొందించే పనిలో ఉంది. 90 మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ల సహకారంతో మందుల దుష్ప్రభావాల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇప్పటికే 40వేల మందుల దుష్ప్రభావాల వివరాలతో ఒక డాటా బ్యాంక్ ను కూడా ఏర్పాటు చేశామని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జి.ఎన్.సింగ్ చెప్పారు.