: అత్యంత ఖరీదైన విడాకులు ఇవే.. రూ.8,470 కోట్లతో భార్యకు విడాకులు
చైనాలో అత్యంత ఖరీదైన విడాకుల సంఘటన చోటుచేసుకుంటోంది. మామూలుగా భార్యాభర్తలు విడాకులు తీసుకునే సమయంలో భర్తనుంచి భార్యకు భరణంగా ఎంతో కొంత ఇస్తారు. అయితే, వీడియో గేమ్‌లను తయారు చేసే ప్రముఖ సంస్థ 'బీజింగ్ కున్‌లున్ టెక్' కంపెనీ చైర్మన్, సీఈవో ఝౌ యుహి (39) తన భార్యనుంచి విడాకులు తీసుకుంటున్న సందర్భంగా తన ఆస్తిలో సగభాగాన్ని ఆయన తన భార్యకు చెల్లించాల్సి వస్తోంది. తన భార్య లీ (38)తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్న ఝౌ యుహి తమ ఆస్తుల నుంచి ఆమెకు 8,470 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. భార్యాభర్తలిరువురి పేరిట మొత్తం 26,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. అయితే వారి ఆస్తుల్లో సుమారు 17 వేల కోట్ల రూపాయలు ఇద్దరూ పంచుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఇరువురికీ 8,470 కోట్ల రూపాయలు వస్తాయని సదరు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. తమ దేశంలో అత్యంత ఖరీదైన విడాకులు ఇవేనని అక్కడి వార్తాపత్రికలు పేర్కొన్నాయి. విడాకుల అంశంలో గతంలో ఆ దేశంలో ఒక వ్యాపారి తన రష్యా భార్యకు రూ.7,400 కోట్లు చెల్లించుకోవాల్సి వచ్చింది. వారి పేరిటే ఇప్పటివరకు ఖరీదైన విడాకుల రికార్డు ఉంది. తాజాగా యుహి జంట బ్రేక్ ఆ రికార్డుని అధిగమించనుంది. ఇక ఆ దేశంలో విడాకుల కేసులు భారీగా పెరిగిపోయాయి. 2000లో 12 లక్షల జంటలు విడాకులు తీసుకోగా, 2009లో 25 లక్షల జంటలు తీసుకున్నాయి. ఇక 2015లో ఏకంగా 38 లక్షల జంటలు విడాకులు తీసుకున్నాయి.