: తొమ్మిదేళ్లకే పోలీసు ఆఫీసర్ అయిన చిన్నారి.. బాలుడి కల నెరవేర్చిన పోలీస్ శాఖ!
తొమ్మిదేళ్ల బాలుడు పోలీసు అధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. పోలీస్ డ్రస్ వేసుకొని ఆదేశాలు జారీ చేశాడు. ఈ అద్భుతం అమెరికాలోని ఇటాకాలో జరిగింది. రెండేళ్ల వయసులోనే కోలిన్ టోలండ్ అనే చిన్నారి కేన్సర్ బారిన పడ్డాడు. ఇప్పుడు ఆ చిన్నారి వయసు తొమ్మిదేళ్లు. తాజాగా అక్కడ పోలీసు అధికారి ఉద్యోగంలో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిన్నప్పటి నుంచి కోలిన్ టోలండ్‌కి పోలీసు అధికారి కావాలనే కోరిక ఉండేది. దీంతో ఆ ప్రాంత పోలీసు శాఖ అధికారులు ఆ చిన్నారిని పోలీసు అధికారిగా నియమించి ఆ చిన్నారి కలను నెరవేర్చారు. ఆ చిన్నారిని అతడి కుటుంబసభ్యులు చూస్తుండగా అతడి క్లాస్‌మేట్ల సమక్షంలోనే పోలీసు అధికారులు అతడిని పోలీసుని చేశారు. యూనిఫాం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా కోలిన్ టోలండ్ మాట్లాడుతూ.. పోలీసు దుస్తులపై ఉండే బ్యాడ్జి మీద తన పేరు చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఆ చిన్నారికి కేన్సర్ వ్యాధిని తొలగించేందుకు డాక్టర్లు ఇప్పటికి మూడుసార్లు మెదడుకు ఆపరేషన్ నిర్వహించారు. సహజంగా ఇప్పటికే ఆ చిన్నారి స్పృహ కోల్పోయి బెడ్ రెస్ట్‌లోనే ఉంటాడని డాక్టర్లు భావించారట. ఆ బాలుడికి ఉన్న మానసిక స్థైర్యం వల్లే తొమ్మదేళ్లు వచ్చినా ఇంకా మామూలు స్థితిలోనే ఉన్నాడని కోలిన్ తల్లిదండ్రులు మీడియాతో తెలిపారు. తమ చిన్నారి ప్రతిరోజుని జీవితాన్ని ఆస్వాదించడానికి లభించిన ఒక అవకాశంగా భావిస్తాడని వారు గర్వంగా చెప్పారు. అంతేకాదు తనకు ఎప్పుడయినా ఇబ్బందిగా అనిపిస్తే కోలిన్ ఒక జోక్ వేసుకొని తనలో తాను నవ్వుకుంటాడని వారు పేర్కొన్నారు. చిన్నారిని పోలీసు అధికారిగా నియమించిన ఇతాకా పోలీసు చీఫ్ జాన్ బార్బర్ మాట్లాడుతూ... చిన్నారి కోలిన్ లాంటి ధైర్యవంతులు తమ పోలీసు శాఖలోకి రావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. సదరు పోలీసు శాఖలో చేసిన నియామకాలలో కోలిన్ నియామకమే అత్యుత్తమమైనదిగా నగర మేయర్ స్వాంటే మిరిక్ అభివర్ణించారు.