: ప్యాకేజీని పవన్ సమగ్రంగా పరిశీలించలేదు: బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ కేంద్రంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయనపై బీజేపీ తిరుపతి నేత భానుప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాకి బదులుగా సాయంగా కేంద్రం ప్రకటించిన రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజీని ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారని, ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలా? అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంశాన్ని పవన్ సమగ్రంగా పరిశీలించకుండా మాట్లాడడం భావ్యం కాదని ఆయన అన్నారు. కేంద్రంలో తమ పార్టీ సొంత బలంతోనే పీఠమెక్కిందని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రాలకి ఇవ్వాల్సిన సాయాన్ని ఆయా రాష్ట్రాలు ఇచ్చే ప్రణాళికల ఆధారంగా చేస్తుందని వివరించారు.